వాట్సప్‌లో కొత్త స్కామ్..! ఈ కాల్స్ వస్తే జాగ్రత్త

Posted by

వాట్సప్‌లో కొత్త స్కామ్..! ఈ కాల్స్ వస్తే జాగ్రత్త

వాట్సాప్ కాల్స్ ద్వారా మోసం చేయడం ప్రారంభించేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.

 

ఇటీవల కొంత మంది స్కామర్లు వాట్సాప్ ద్వారా అంతర్జాతీయ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నారు. దేశం కోడ్ +84 నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు కనిపెట్టిన ఓ కొత్త మార్గమే వాట్సప్ కాల్స్. +84 అనేది వియాత్నం దేశం కోడ్ కాగా, +62 అనేది ఇండోనేషియా కోడ్, ఇక్కడ మరో నెంబర్ +223 (ఇది మాలి కోడ్).

 

ఈ కోడ్స్ కలిగిన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వినియోగదారుడు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఈ నెంబర్స్ నుంచి వస్తున్న కాల్స్ నిజంగా ఆదేశం నుంచి వస్తున్నాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు ఆన్‌లైన్‌లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ (VoIP) కొనుగోలు చేస్తారని ఒక నివేదిక వెల్లడించింది.

 

ఈ స్పామ్ కాల్స్ గురించి V4WEB సైబర్ సెక్యూరిటీ వ్యవస్థాపక డైరెక్టర్ ‘రితేష్ భాటియా’ మాట్లాడుతూ.. VoIP నెంబర్ కొనుగోలు చేయడం చాలా సులభమని, ఆయా దేశాల నుంచే వాట్సాప్ యాక్టివేట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తరువాత ప్రపంచంలో ఉన్న ఏ వినియోగదారునినైనా లక్ష్యంగా చేసుకోవచ్చని వివరించారు.

 

అంతర్జాతీయ నెంబర్ నుంచి వచ్చే వాట్సప్ కాల్స్ మోసపూరితమైనవి కావున ఎవరూ వాటిని రిసీవ్ చేయవద్దని సలహా ఇస్తున్నాము. ఇలాంటి వాటిని నిలువరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైన్టిస్టులు, సంబంధిత నిపుణులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి కాల్స్ రాకుండా చూడటానికి చర్యలు జరుగుతున్నట్లు వాట్సాప్ ప్రతినిథి వెల్లడించారు.

 

ఇటీవల ఈ స్పామ్ కాల్స్ గురించి వివరిస్తూ.. ట్విట్టర్‌లో శ్రేయన్ష్ జైన్ అనే వ్యక్తికి ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చిందని, అందులో ప్రిసిల్లా బారెట్ అనే పేరుతో HRగా పరిచయం చేసుకున్నారని, ఆ తరువాత పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చని.. దీనికి యూట్యూబ్ వీడియోను లైక్ చేయాలనీ, ఒక్కో లైక్‌కు రూ. 50 వస్తుందని, ఇలా మీరు రోజుకి రూ. 10,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చని చెప్పినట్లు తెలిపాడు.

 

ఇలాంటి మోసాలకు ఎవరూ బలి కాకుండా ఉండాలంటే రాంగ్ నెంబర్ నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ స్వీకరించవద్దని తెలియజేస్తున్నాము.